Title Picture

రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన 'శభాష్ రాజా' తెలుగు చిత్రం (డబ్బింగు కాదు) ఇంతకు ముందు సి.ఎస్. రావు దర్శకత్వం క్రింద సుందర్ లాల్ సహతా నిర్మించిన చిత్రాల స్థాయిలో ఉంది. శతదినోత్సవ చిత్రాల లక్షణాలను మేళవించుకున్న ఈ చిత్రం మన ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని కావలసినంతగా అందించగలదు.

రాజా (నాగేశ్వరరావు) రాణి (రాజసులోచన)ని ప్రేమించాడు. పదిహేనేళ్ళ క్రితం రాజా తన అన్న ప్రోద్భలంతో ఇంట్లో దొంగతనం చేయబోయి పట్టుబడి ఇంట్లో నుంచి గెంటివేయబడ్డాడు. తర్వాత దొంగతనాలు చేసుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. ఆస్తి అంతా అన్న రఘుకు (కాంతారావు) దక్కింది. అతను గొప్ప వ్యాపారస్థుడు. గుణవతి, రూపవతి అయిన భార్య (దేవిక)ను వదిలిపెట్టి, ఒక వన్నెలాడి (గిరిజ) చేతులో చిక్కి సర్వనాశనమైపోతుంటే రాజా తన స్నేహితుడు మిరియాలు (రేలంగి)తో కలిసి అనేక సాహసాలు, త్యాగాలు చేసి అన్నకు బుద్ధి చెప్పి అతని కాపరాన్ని నిలబెట్టాడు. చివరకు రాజాకు రాణికి పెళ్ళి అవుతుంది.

ఈ కథను దర్శకుడు రామకృష్ణ చాలా వేగంగా హుషారుగా నడిపించాడు. చిత్రంలో ప్రతి సన్నివేశం ఏదో ఒక రూపేణా అన్ని వర్గాల ప్రజలకూ వినోదం, వేడుక కల్పించగల విధంగా ఉన్నాయి. అలాగే రచన కూడా చాలా వినోదకరంగా ఉంది. చాలా సంభాషణలు ప్రజల చేత ఈలలు కొట్టించగల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ సముద్రాల గారు తెలుగు సినిమా మీద వేసిన జోకు చాలా బాగా ఉంది. రఘు భార్య సంసారం కష్టాలపాలు అయింది కదా అని అంతకు ముందు నవ్వుతూ పాడిన పాటకు ఏడుపురాగం పెట్టి దేవుడి విగ్రహం దగ్గర కూర్చుని పాడుతూ ఉంటుంది. రఘు వచ్చి ''ఇదేం ఇల్లనుకున్నావా, సినిమా హాలనుకున్నావా? అంటాడు. ఆమె ''ఇది వరకు మీరు దీన్నే పదే పదే పాడమనేవారుగా'' అంటుంది దీనంగా. అతను ''విని విని వెగటుపుట్టింది'' అంటాడు ప్రేక్షకుడి ధోరణిలో. ఆ సన్నివేశాన్ని రచించినందుకు రచయిత ఎంతైనా ప్రశంసనీయుడు. అలాగే రచయిత నవలల మీద ఒక జోకు, పత్రికల మీద బోలెడు జోకులు విసిరారు.

ఘంటసాల సంగీతం ఈ చిత్రానికి అవసరమైన విధంగా ఉంది. దాదాపు పాటలన్నీ హిట్ అవుతాయనడంలో సందేహం లేదు. నాగేశ్వరరావు, రేలంగి తమ మామూలు ధోరణిలో హుషారుగా నటించారు. నాగేశ్వరరావు ఇదివరకు ధరించిన ఈ రకం పాత్రలన్నింటి కంటే ఈ పాత్రకు ఆవేశం ఎక్కువ కావడం వల్ల ప్రేక్షకులకు మరీ బాగా నచ్చుతుంది. నాగభూషణం విలన్ గా కొత్త తరహాలో నటించడానికి ప్రయత్నించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కాంతారావు, దేవిక, రాజసులోచన, గిరిజ మున్నగువారంతా ఉచిత రీతిని నటించారు.

దర్శకుడు: రామకృష్ణ; నిర్మాతలు: సుందరలాల్ నహతా, ఢూండీ; రచన: సముద్రాల జూనియర్; పాటలు: సముద్రాల (జూ), ఆరుద్ర, కొసరాజు; సంగీతం: ఘంటసాల; కెమెరా: కమల్ ఘోష్; తారాగణం: నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కాంతారావు, రేలంగి, గిరిజ, నాగభూషణం, లింగమూర్తి, నల్ల రామ్మూర్తి వగైరా.

నండూరి పార్థసారథి
(1961 నవంబర్ 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post