Title Picture

ప్రపంచం మొత్తం మీద జనాభా విషయంలో మన దేశానిది రెండో స్థానం. కథా చలన చిత్రాల ఉత్పత్తిలో కూడా మనది రెండోస్థానం. మన అరవై కోట్ల జనాభాలో దాదాపు 24 కోట్ల మంది బాలబాలికలున్నారు. అయితే మన దేశంలో ఏటా ఉత్పత్తి అవుతున్న సుమారు 600 కథాచిత్రాలలో బాలల చిత్రాలని చెప్పుకోదగినవి రెండు మూడైనా ఉండడం లేదు. మనకంటే ఎక్కువ చలన చిత్రాలు నిర్మిస్తున్న జపాన్ లో పిల్లల కోసం ఏటా బోలెడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇంతా చేసి జపాన్ జనాభా మన జనాభాలో ఆరోవంతు మాత్రమే.

మన దేశంలో పిల్లలకు-ప్రత్యేక చిత్రాలు లేవు. పోనీ దిగుమతి చేసుకుంటే వాటిని ప్రదర్శించడానికి థియేటర్లు దొరకవు. మామూలు వ్యాపార సరళి చిత్రాలు ప్రదర్శించే థియేటర్లు పిల్లల చిత్రాలను ప్రదర్శించడానికి ఇష్టపడడం లేదు. కనీసం వారానికో రోజు ఉదయం ఆటలు ఆడించడానికైనా ఒప్పుకోవడం లేదు. చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు 'సెక్స్-క్రైం' మసాలా దట్టించిన చౌకబారు చిత్రాలకు అంకితమైపోయారు. చూసి చూసి ప్రేక్షకులు కూడా వాటికే అలవాటుపడ్డారు.

కళ్ళు మిరుమిట్లు గొలిపే భారీ సెట్టింగులతో, వందవాద్యాల స్టీరియోఫోనిక్ సౌండ్ తో, ఈస్ట్ మన్ కలర్, సినిమాస్కోప్, సెవెంటీ ఎం.ఎం. హంగులతో పచ్చిశృంగారాన్ని, రాక్షసహింసా కాండను చూపించడంలో నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ జూదంలో లక్షలు పణంగా ఒడ్డుతున్నారు. కొద్ది మంది కోట్లు గడిస్తున్నారు. పెక్కుమంది దివాలా తీస్తున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక, శ్రద్ధ ఎవరికీ లేవు.

పగలంతా స్కూల్లో ఊకదంపుడు పాఠాలు విని విసుగెత్తిపోయిన పిల్లలకు సాయంత్రం పూట కాస్తంత మనోల్లాసం కలిగించే మార్గమేదీ లేకుండాపోయింది. తమకు ప్రత్యేక చిత్రాలు లేవు కదా అని పిల్లలు సినిమాలు చూడడం మానరు. వాళ్ళకీ కాలక్షేపం కావాలి కదా. అందుచేత అమ్మా నాన్నా చూసే సెక్స్-క్రైం చిత్రాలే చూస్తున్నారు. ఆ రెండూ లేని చిత్రాలు బజారులో దొరకడం లేదు కదా-అవి వద్దనుకుంటే సత్యజిత్ రాయ్, మృణాళ్ సేన్ వంటి మేధావుల చిత్రాలు చూడాలి. పిల్లలకి అవి మరీ అయోమయంగా ఉంటాయి. పెద్దలు సాధారణంగా తాము వెళ్ళే సినిమాలకే పిల్లలను తీసుకువెడుతూ ఉంటారు. తాగుడు దృశ్యాలు, కేబరే డాన్సులు గల చిత్రాలకు తల్లులు పిల్లలను చక్కగా చంకన వేసుకుని వెడుతున్నారు. అంటే సెక్స్-క్రైం చిత్రాలను మన పిల్లలకు ఉగ్గుపాలతో మప్పుతున్నామన్నమాట.

'పెద్దలకు మాత్రమే' ఉద్దేశించిన చిత్రాలను హైస్కూలు పిల్లలు కూడా యథేచ్ఛగా చూస్తున్నారు. మన పిల్లలకి సినిమాలే కాదు-ప్రత్యేకంగా పార్కులూ లేవు, గ్రంథాలయాలూ లేవు, ఉన్నవల్లా పాఠశాలలు మాత్రమే. పోనీ ఆ పాఠశాలల్లోనే మంచి గ్రంథాలయాలు, ఆటస్థలాలూ ఉంటాయా అంటే అదీ లేదు. పార్కు, గ్రంథాలయం, థియేటర్ వంటి హంగులన్నీ ఉన్న జవహర్ బాలభవన్ లు ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, మద్రాస్, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో మాత్రమే ఉన్నాయి. బాల జనాభాలో నూటికి ఒకరిద్దరికైనా వాటివల్ల ప్రయోజనం ఉండాలి కదా అటువంటివి ప్రతి పట్టణంలోనూ నెలకొల్పడం అవసరం.

విశ్వజనీన భాష

వినోదానికి, వికాసానికి సినిమాను మించిన సాధనం మరొకటి లేదు. పుస్తకాలు, పత్రికలు, రేడియో సాధించలేని ఫలితాలను సినిమా సాధించగలదు. దూర దేశాలలో ప్రదేశాలలోని ప్రజల జీవన పరిస్థితులను, ప్రకృతి దృశ్యాలను సినిమా ప్రత్యక్షంగా చూపగలదు. పుస్తకంలో వంద పేజీలు వర్ణించినా చెప్పలేని విషయాన్ని సినిమా అరనిమిషంలో చెప్పగలదు. పత్రికలలో వార్తలు, వ్యాఖ్యలు, ఫోటోలు వివరించలేని ఉపద్రవాల తీవ్రతను డాక్యుమెంటరీ చిత్రాలలో చూసి తెలుసుకోగలుగుతాము. పుస్తకాలు, పత్రికలు అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తాయి. పైగా వాటికి భాషాభేదాలుంటాయి. సినిమాకు భాషాభేదాలు లేవు. అది విశ్వజనీన భాష.

మంచి సినిమా ద్వారా ఎంత మంచి ఫలితాలను సాధించగలుగుతామో, చెడు సినిమా ద్వారా అంత చెడు ఫలితాలను సాధించగలుగుతాము. అయితే మంచి ప్రభావం గాని, చెడు ప్రభావం గాని వెంటనే కనిపించకపోవచ్చు. మత్తు పదార్థాలు నెమ్మదిగా ఆరోగ్యాన్ని హరించినట్లు చెడు చిత్రాలు నెమ్మదిగా మనస్సును ఖరాబు చేస్తాయి. మన భావిభారతపౌరులు ఇప్పుడు చౌకబారు చిత్రాల విషప్రభావంతో పెరుగుతున్నారు. ఈ దుష్ర్ర్పభావం నుంచి వారిని కాపాడకపోతే భావి భారత సంస్కృతి ఎలా తయారవుతుందో ఊహించుకోవచ్చు.

చెడు చిత్రాల బారి నుంచి పిల్లలను కాపాడాలంటే వారి కోసం ప్రత్యేకంగా మంచి చిత్రాలు నిర్మించడం ఒకటే మార్గం. భారత ప్రభుత్వం ఈ సంగతి పాతికేళ్ల క్రిందటే గ్రహించి 'బాల చిత్ర సమితి' (చిల్డ్రన్ ఫిలిం సొసైటీ)ని నెలకొల్పింది. బాలల చిత్రాలు మోరల్ క్లాస్ పాఠాల ధోరణిలో ఉండకూడదు. హాస్య సన్నివేశాలతో, సాహసకృత్యాలతో, ఉత్కంఠతో చిత్రం అద్యంతం ఉత్సాహభరితంగా ఉండాలి. విజ్ఞానాన్ని అందించినా నీతిబోధ చేసినా చాలా సున్నితంగా చేయాలి. వినోదం ఎక్కడా కుంటుపడకూడదు. కథ ఎంత గొప్పదైనా, కథనం బాగా లేకపోతే ఎవరూ చూడరు. పిల్లల మనస్తత్వాన్ని అవగాహన చేసుకొని, వారిని ఆకట్టుకోగల సన్నివేశాలతో కథను అల్లి, ఆ కథను మంచి 'టెంపో'తో తెరపై నడిపించి, రక్తి కట్టించాలి. 'టెంపో' సినిమాకు ప్రాణం. అయితే, పిల్లలను హుషారు చేయడం కోసం సినిమాలలో కృత్రిమత్వాన్ని ప్రవేశపెట్టడం చాలా తప్పు. హాస్య సన్నివేశాలుగాని అవాస్తవికంగా కనిపించకూడదు. హాస్యం వెకిలిగా ఉండకూడదు. దాని మోతాదు తెలుసుకోవాలి. మెలోడ్రామా ఉండకూడదు. అంటే-కన్నీళ్లు, కడగండ్లు, త్యాగాలు లాంటివి మితిమీరకూడదు. అవి సహజంగా కనిపించాలి. ఉపన్యాసాల వంటి సంభాషణలు ఉండకూడదు. బీభత్స భయానక దృశ్యాలు ఉండకూడదు. ఇన్ని నియమాలతో బాలల చిత్రాన్ని తీసి రక్తి కట్టించాలంటే ఎంతో ప్రతిభ కావాలి.

ప్రైవేటు నిర్మాతలు తీసిన బాలల చిత్రాలు కొన్ని బాలల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. జాతీయ చలనచిత్ర బహుమతులతో ఉత్తమ చిత్రానికి రాష్ట్రపతి స్వర్ణపతకం లాగానే, ఉత్తమ బాలల చిత్రానికి ప్రధాన స్వర్ణపతకాన్ని ప్రవేశపెట్టారు. కాని, గత పాతిక సంవత్సరాలలో వచ్చిన బాలల చిత్రాలే తక్కువ. వాటిలో బహుమతికి యోగ్యమైనవి మరీ తక్కువ. ఇప్పటి వరకు మూడు నాలుగు చిత్రాలకు మాత్రమే బహుమతులు లభించాయి. ఈ బహుమతులు ప్రవేశపెట్టకపూర్వం తెలుగులో కె.ఎస్. ప్రకాశరావు గారు తీసిన 'దీక్ష' చిత్రం అన్ని విధాలా పిల్లలకు తగిన చిత్రం. దాని తర్వాత ఆయనే 'బూర్లెమూకుడు', 'కొంటె కిష్ణయ్య', 'రాజయోగం' అనే మూడు చిన్న చిత్రాలను తీసి, మూడింటినీ కలిపి 'బాలానందం' అని పేరు పెట్టారు. వాటిలో అందరూ పిల్లలే నటించారు. వారందరూ న్యాయపతి రాఘవరావు గారి బాలానంద సంఘ సభ్యులే, పిల్లలకోసం పిల్లలతో చిత్రాలు నిర్మించడం నిజంగా గొప్ప సాహసం. ఆ సాహసం అప్పటికీ ఇప్పటికీ మళ్లీ ఎవరూ చేయలేదు. ఏడాది క్రితం సుచిత్ర ఎంటర్ ప్రైజెస్ వారు 'ద నాటీ పెయిర్' అనే బాలల చిత్రాన్ని ఇంగ్లీషులో తీశారు. దర్శకుడు, నిర్మాత తెలుగువారే. మంచి ఆశయంతోనే తీశారు. మళ్ళీ వారే ఇప్పుడు ఇంకొక బాలల చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలలో తీస్తున్నారు.

సుమారు ఏడాది క్రిందట బాల చిత్ర సమితి అధ్యక్ష పదవిని సుప్రసిద్ధ దర్శక నిర్మాత శాంతారాం స్వీకరించారు. సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలోనూ ఆయనకు యాభై సంవత్సరాల అనుభవం ఉన్నది. దేశంలోని అగ్రశ్రేణి, అత్యుత్తమ దర్శకులలో ఆయన ఒకరు. బాలల చిత్రాలను గురించి ఆయనకు సమగ్రమైన అవగాహన ఉన్నది. బాలలకోసం ఆయన తీసిన 'ఫూల్ ఔర్ కలియా' చిత్రానికి ప్రధాని స్వర్ణపతకం లభించింది, బాల చిత్ర సమితిని పూర్తిగా మరమత్తు చేయడానికీ, సరియైన మార్గంలో దానిని నడిపించడానికీ ఆయన పూనుకొన్నారు. బాల చిత్రోద్యమాన్ని చైతన్యవంతం చేయడానికీ. తద్వారా చౌకబారు వ్యాపార చిత్రాల ప్రభావం నుంచి బాలలను కాపాడడానికీ ఆయన పంచవర్ష బృహత్ర్పణాళికను రూపొందించారు.

ఏటా దేశంలోని అన్ని ప్రధాన భాషలలోనూ రెండేసి బాలల చిత్రాలను నిర్మించాలనీ, వాటిని ఇతర భాషలలోకి డబ్ చేయాలనీ ఆయన సంకల్పించారు. అంతర్జాతీయ బాలల సంవత్సరంగా పరిగణిస్తున్న ప్రస్తుత సంవత్సరంలో ఈ సంస్థను అన్ని విధాలా శక్తివంతం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రత్యేకంగా బాలల చిత్రాల నిర్మాణం కోసం బొంబాయిలో 70 లక్షల రూపాయల ఖర్చుతో ఒక స్టూడియో కాంప్లెక్స్ ను నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ కాంప్లెక్స్ లో బాలల చిత్రాలను తయారు చేయడమే కాకుండా చిత్ర నిర్మాణంలో బాలలకు శిక్షణ కూడా ఇస్తామని ఆయన చెప్పారు. ఆ కాంప్లెక్స్ లో బాలల పార్క్, గ్రంథాలయం, థియేటరు వంటి సకల సదుపాయాలూ ఉంటాయి. అన్ని భాషలలో తయారైన బాలల చిత్రాలను ఇతర భాషలలోకి డబ్ చేయడానికి కావలసిన సదుపాయాలు కూడా అక్కడ ఉంటాయి. బాలల చిత్రాల నిర్మాణానికి సంబంధించినంత వరకు ఇక ఇతరుల స్టూడియోలపై ఆధారపడవలసిన పనిలేదు.

పంపిణీ, ప్రదర్శన సమస్యలకు కూడా ఆయన పరిష్కార మార్గాలు కనుగొన్నారు. బాల చిత్రసమితి తన చిత్రాలను తానే పంపిణీ చేస్తున్నది. బాలభవన్ లు ఉన్న పెద్ద నగరాలలో బాలల చిత్రాల ప్రదర్శన సమస్య కానేకాదు. బాలభవన్ లు లేనిచోట్ల, అసలు థియేటర్లే లేని మారుమూల గ్రామాలలో 16 ఎం.ఎం. ప్రొజెక్టర్లతో ఈ చిత్రాలు చూపించాలని సంకల్పించారు. ఈ సంస్థవారు 16 ఎం.ఎ ప్రొజెక్టర్లు, తెరలు తీసుకొని పల్లెలకు వెళ్లి పాఠశాలల్లోనూ, దేవాలయాలలోనూ, గ్రామమందిరాలలోనూ 20 పైసల టిక్కెట్టుకు ఈ చిత్రాలను చూపిస్తారు. 20 పైసల టిక్కెట్లతోనే ఈ చిత్రాలకు పుష్కలంగా డబ్బులు వస్తాయి. ఈ వసూళ్ళతో బాల చిత్ర సమితి సక్రమంగా-ప్రభుత్వపు గ్రాంట్లతో నిమిత్తం లేకుండా-స్వయం పోషకం కాగలదు.

తమిళంలో తీసిన ప్రతి బాలల చిత్రానికి లక్ష రూపాయల చొప్పున, ఇతర భాష నుంచి తమిళంలోకి డబ్ చేసిన ప్రతి బాలల చిత్రానికి పాతిక వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విధమైన ప్రోత్సాహం అందజేస్తే బాల చిత్రోద్యయం నాలుగైదు సంవత్సరాలలో గొప్ప అభివృద్ధి సాధించగలదనడంలో సందేహం లేదు.

తెలుగులో బాలల చిత్రం తీసేవారికి పూర్తిగా పెట్టుబడి ధనం అందజేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్య ఒక పథకాన్ని రూపొందించింది. బాలల చిత్రాలు తీయదలచేవారు స్క్రిప్టులను అందజేపేటట్లయితే, వాటిని పరిశీలించి, యోగ్యమైనవిగా కనిపిస్తే నాలుగు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ విధంగా ఏడాదికి నాలుగు బాలల చిత్రాలకు ధనసహాయం అందజేయాలని తలపెట్టింది. స్క్రిప్టుల పరిశీలనకు స్వర్గీయ బి.ఎన్.రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది కూడా. అయితే రెడ్డిగారి మరణానంతరం ఆ పథకం ముందుకు సాగలేదు. బాలల చిత్ర సప్తాహాన్ని ఘనంగా నిర్వహించి బాలల సంవత్సరానికి ప్రారంభోత్సవం చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని పునరుద్ధరించి వెంటనే బాలల చిత్రాల నిర్మాణానికి ఉద్యమించగలదని ఆశిద్దాం. ఈ పథకం అమలులోకి వస్తే, బాలల చిత్రోద్యమానికి సంబంధించినంత వరకు దేశం మొత్తం మీద మన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకం కాగలదు. తమిళనాడు కంటే మనం ఇంకొక అడుగు ముందుకు వేసినట్లవుతుంది. బాలలకు వినోద దారిద్ర్యాన్ని తీర్చినవాళ్ళమవుతాము.

నండూరి పార్థసారథి
(మార్చి 1979 ఆంధ్రప్రదేశ్ పత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post