Title Picture

క్రిందటి సంవత్సరం తెలుగులో తొంభై పైచిలుకు చలన చిత్రాలు విడుదలైనాయి. ఈ ఏడాది తెలుగు చిత్రాల సంఖ్య వంద దాటిపోతుందని అంచనా. రాసిలో దేశం మొత్తం మీద హిందీ చిత్రాల తర్వాత మనదే పైచేయి. వాసిలో కూడా మనం ఎవ్వరికీ తీసిపోమని మన చిత్ర నిర్మాతలు, దర్శకులు, ఫిలిం జర్నలిస్టులు భరోసా ఇస్తున్నారు. అట్టేమాట్లాడితే మనం, కళాఖండాలను గురించి బెంగాలీ, మళయాళీ, కన్నడ చిత్ర దర్శకులకు సైతం పాఠాలు చెప్పగలమని జబ్బచరిచి చెబుతున్నారు.

తెలుగులో ఉత్తమ చిత్రాలు, అద్భుత చిత్రాలు, అపూర్వచిత్రాలు, సంచలన చిత్రాలే తప్ప, నాసిరకం చిత్రాలు, ఓ మోస్తరు చిత్రాలు రావడం లేదని మన సమీక్షకులు ఇంచుమించు ఏకగ్రీవంగా చెబుతున్నారు. అయితే, ఏది ఉత్తమ చిత్రం, ఏది సంచలన చిత్రం, ఏది అపూర్వ చిత్రం అనే విషయంలో సమీక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు-'బంగారుపాప' కళాఖండమనీ, 'దెబ్బకు ఠా దొంగల ముఠా' అపూర్వ చిత్రమనీ ఒక సమీక్షకుడు రాస్తే, 'దెబ్బకు ఠా' యే కళాఖండమనీ 'బంగారుపాప' అపూర్వచిత్రమనీ ఇంకొక సమీక్షకుడు రాస్తాడు. ఇటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద నాసిరకం చిత్రాలు తెలుగులో రావడం లేదన్న విషయంలో అందరూ ఏకీభవిస్తున్నారు.

మన సమీక్షకుల అంచనా ప్రకారం పసందైన నృత్యాలు, కర్ణపేయమైన సంగీతం, నేత్రపర్వమైన ఛాయగ్రణం నిర్దుష్టమైన శబ్దగ్రహణం, చిక్కనికథ, చక్కని సంభాషణలు ప్రతిభావంతమైన దర్శకత్వం, పాత్రలకు జీవం పోసే నటన మన చిత్రాల సొత్తు. సానుభూతిలో, సమదృష్టితో తెలుగుచిత్ర సమీక్షకునికి మరెవ్వరు సాటిరారు. సత్యజిత్ రాయ్ చిత్రాన్ని, విఠలాచార్య చిత్రాన్ని కూడా కళాఖండంగా వర్ణించగల సమదృష్టి, ఔదార్యం తెలుగు సమీక్షకునికి మాత్రమే ఉన్నాయి. మురికిగుంటలో సైతం సౌందర్యాన్ని దర్శించగల కళాదృష్టి, ఏ చెత్తనైనా హరాయించుకోగల జీర్ణశక్తి తెలుగు సమీక్షకునికి మాత్రమే ఉన్నాయి.

ఈ మధ్య చలన చిత్ర నిర్మాతలకు, ఫిలిం జర్మలిస్టులకు మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 'అవగాహన' పెంపొందుతున్నది. నిర్మాతలు తాము ఎంత వ్యయప్రయాసలుకోర్చి చిత్రాలను నిర్మిస్తున్నారో, ఎయిర్ కండిషన్డు హోటల్లో కూర్చోబెట్టి పెగ్గుబాలతో బోధిస్తున్నారు. ఈ చిత్రాలలోని ఉన్నతాదర్శాలను, కళాత్మక సందేశాలను, మహోన్నత నైతిక విలువలను నూరిపోస్తున్నారు. అనుపానంగా ఐస్ క్రీమ్ లు, బాదంపాలు, ఫెళఫెళలాడే పచ్చకాగితాలు వడ్డిస్తున్నారు. పాత్రికేయులు యథాప్రకారంగా ప్రశంసలతో ఋణం తీర్చుకుంటున్నారు. అమ్ముడుపోయిన ఈ ఫిలిం జర్నలిస్టులు, వీరిని కొనుక్కున్న దర్శక నిర్మాతలు కలిసి కుమ్మక్కై తెలుగు పాఠకులకు అబద్ధాలతో తలంటిపోస్తున్నారు. అయితే ఇదంతా లాలూచీ వ్యవహారమని తెలుసుకోలేనంతటి అమాయకులు కారు పాఠకులు. జర్నలిస్టులు రాసే సమీక్షలు నిర్మాతలను మెప్పించడానికే తప్ప, తమకోసం కాదని వారికి తెలుసు. చాలామంది సినిమా పేజీలలో బొమ్మలని మాత్రం చప్పరించి అవతల పడేస్తూ వుంటారు. మోజు, తీరిక గలవారు సినిమా వార్తలు కూడా చదువుతూ వుంటారు. కనుక కాలక్షేపానికి పనికొస్తాయని కొందరు, పకోడీలు కట్టుకోడానికి ఏ కాగితమైతేనేం అని మరికొందరు సినిమా పత్రికలు కొంటున్నారు. సినిమాలపై పాత్రికేయుల (బొత్తిగా) వెలలేని అభిప్రాయాలకోసం పత్రికలు కొనేవారు నూటికి ఒక్కరు కూడా లేరని చెప్పడానికి మొహమాటం పడనక్కరలేదు.

విజ్ఞానానికైనా, వినోదానికైనా మనదేశంలో సామాన్య ప్రజలకు అందుబాటులో వున్న సాధనాలు-సినిమా, రేడియో, పత్రికలు. ఇవి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒక తరానికి, ఇంకొక తరానికి ఆలోచనా విధానంలో దృక్పధంలో మార్పు వస్తున్నదంటే మార్పునకు ముఖ్యకారణం ఈ ప్రచార సాధనాల ప్రభావమని ఖచ్చితంగా చెప్పవచ్చు. పత్రికల ప్రభావం చదువుకున్న వారిపైనే ఉంటుంది. సినిమా, రేడియో ప్రభావం నిరక్షరాస్యుల మీద కూడా ఉంటుంది. అవి శక్తివంతమైన సాధనాలు కనుక, వాటిని తమ అదుపులో పెట్టుకోవడానికి స్వార్ధపరులు ప్రయత్నిస్తూ ఉంటారు. సినిమా, రేడియో, పత్రికా రంగాలను నిర్వహించే వారు ప్రలోభాలకు లోనై బాధ్యతారహితంగా ప్రవర్తించడం సమాజానికి, సంస్కృతికి ద్రోహం చేయడమే అవుతుంది. ''నేనొక్కడినే కక్కుర్తిపడితే సమాజానికి పోయేదేమిటి!'' అని ఎవరికివారే అనుకుంటే నిజంగానే సమాజం కుళ్ళిపోతుంది.

రేడియో లాభాపేక్షతో నడుస్తున్న వ్యవస్థ కాదు కనుక అది ఆట్టే కలుషితం కాలేదు. కాని, సినిమా పత్రికారంగాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కొంత వ్యాపారసరళిలో పనిచేస్తాయి కనుక, వాటిలోని వ్యక్తులు డబ్బు, గ్లామర్ వంటి ప్రలోభాలకు తేలికగా లోనయే ప్రమాదం వుంది. పత్రికల మనుగడకు అడ్వర్టయిజ్ మెంట్లు అవసరం. సినిమా వారికి అనుకూలమైన పత్రికాభిప్రాయం అవసరం. అందుకే సినిమావారు అడ్వర్టయిజ్ మెంట్లు ఇచ్చి, జర్మలిస్టులకు తాయిలాలు ఇచ్చి ప్రశంసలను కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ సంభావనలు ఇచ్చేవారికి, పుచ్చుకునే వారికి కూడా మామూలైపోయాయి. సంభావన ముట్టకపోతే పాత్రికేయులకు సినిమాలు రుచించవు. (ఈ రేట్లు బెజవాడలో కంటే మద్రాసులో, మద్రాసులో కంటే బొంబాయిలో ఎక్కువ అని వినికిడి) ఈ జాడ్యం ఇప్పుడిప్పుడే హైదరాబాదుకు పాకుతున్నది. ఈ సంభావనలను నిరాకరించగలిగిన పాత్రికేయులను ఒక చేతి వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును.

''ప్రజలు ఎటువంటి చిత్రాలను ఆదరిస్తారో అటువంటి చిత్రాలనే మేము నిర్మిస్తాము. లక్షలకు లక్షలు వెచ్చించి సినిమాలుతీసేది ప్రజలకు నచ్చాలనేకదా?'' అనేది నిర్మాతల కపటవాదం. ''యథాప్రజా తథాసినిమా'' అంటారు వారు. చౌకబారు చిత్రాలను అధిక సంఖ్యాక ప్రేక్షకులు ఆదరిస్తున్న మాట నిజమే. కాని, ఆ చౌకబారు తనాన్ని ప్రేక్షకులకు అలవాటు చేసింది సినిమా వారే. ప్రతి మనిషిలో కాస్తో కూస్తో సహజంగా వుండే పాశవిక ప్రవృత్తులను రెచ్చగొట్టి, ఆ విధంగా వారిని తేలిగ్గా ఆకట్టుకోవడానికి సినిమా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తమలోని కుసంస్కారాన్ని బలవంతంగా ప్రేక్షకుల నెత్తిన రుద్ది, వారి మానసికారోగ్యాన్ని ఖరాబు చేస్తున్నారు.

తమకు ఏది ఆరోగ్యకరమో ప్రజలందరికీ తెలియదు. తమకు ఏది శ్రేయస్కరమో అందరికీ తెలియదు. కొందరికి తమకు ఏదికావాలో తెలిసినప్పటికీ అది దొరకనప్పుడు ఏది అందుబాటులో వుంటే దానినే స్వీకరిస్తారు. తమకు కావలసినది లభించనప్పుడు చౌకబారు వాటిని త్రోసిపుచ్చగలవారు కొద్దిమందే వుంటారు. ఏది మంచో, ఏది చెడో తెలియని వారికి తెలియజెప్పడం బాధ్యత. ఈ బాధ్యతను పాత్రికేయులు చిత్తశుద్ధితో నిర్వహిస్తే మరీ ఇంత నాసిరకం చిత్రాలురావు. ఈనాడు మన సినిమాలు ఇంత అధ్వాన్నంగా వుండడానికి ముఖ్యకారణం తెలుగులో అసలు సినిమా విమర్శ అన్నది లేకపోవడమే.

చలనచిత్ర విమర్శకులలో నిజాయితీ గురించి చెప్పుకోవాలంటే దేశం మొత్తం మీద అందరికంటే ముందుగా కన్నడ పాత్రికేయులను చెప్పుకోవాలి. బెంగుళూరులోని ''కర్ణాటక చలన చిత్ర పత్రకర్తర పరిషత్'' (ఫిలిం జర్నలిస్టుల సంఘం) శాస్త్రీయమైన పద్ధతిలో ఆదర్శ సంస్థగా పనిచేస్తున్నది. ఒక చెత్త చిత్రాన్ని చెత్తచిత్రమని రాయడానికి బెంగుళూరు పాత్రికేయులు ఏమాత్రం మొహమాటపడరు. నిర్మాతలు అడ్వర్టయిజ్ మెంట్ల రూపంలో ఎంత ధనం ముట్టజెప్పినా వారి చిత్రాలలోని తప్పులను తూర్పారబట్టడానికి అక్కడి పాత్రికేయులు సంకోచించరు. ఆ మధ్య ప్రముఖ కన్నడ నటుడు కళ్యాణ్ కుమార్ తాను స్వయంగా నిర్మించి, నటించి దర్శకత్వం వహించిన ఒక చిత్రాన్ని పత్రికలవారికి ప్రత్యేకంగా చూపించాడు. పాత్రికేయులకు మంచి విందు ఇచ్చారు. ఆయన చిత్రాన్ని పాత్రికేయులు నిష్కర్షగా విమర్శించారు. తర్వాత ఆయన ఒక విలేఖరితో 'మేము పెట్టిన కేకులు, ఐస్ క్రీములు భోంచేసి ఇలాగా రాయడం మీరు?' అని కోపంగా అన్నాడట. మర్నాడు ఆ వార్త 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'లోకి ఎక్కింది. దానితోపాటు ''పాత్రికేయులు కేకులకీ ఐస్ క్రీములకి అమ్ముడు పోతారనుకుంటే అది చాలా పొరపాటు'' అని వ్యాఖ్య కూడా వెలువడింది. తర్వాత కళ్యాణ్ కుమార్ చలన చిత్ర పత్రకర్తర పరిషత్ అధ్యక్షునికి క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ విషయం కూడా పత్రికలలో ప్రచురించారు పాత్రికేయులు.

పరిషత్ వారు ఒక కొత్త చిత్రం విడుదలైనప్పుడు దర్శక నిర్మాతలను, నటీనటులను ప్రత్యేకంగా ఆహ్వానించి, చిత్రాన్ని గురించి వారితో క్షుణ్ణంగా చర్చిస్తున్నారు. చిత్రంలోని లోపాలను వారికి ఎత్తిచూపిస్తున్నారు. దర్శకులు ఒక్కొక్కప్పుడు అవి తప్పులుకావని సమర్థించుకుంటూ వుంటారు. ఒక్కొక్కప్పుడు తప్పులను ఒప్పుకుంటూ వుంటారు. దర్శక నిర్మాతల వాదాలను కూడా పాత్రికేయులు ప్రచురిస్తారు. ఒక దశలో పాత్రికేయుల నిజాయితీ రాజ్ కుమార్, పుట్టన్న వంటి ప్రముఖులకు సైతం ఆగ్రహం కలిగించింది. అయినా వారు కూడా చివరికి పత్రికా స్వాతంత్ర్యాన్ని గౌరవించక తప్పలేదు. పరిషత్ గత సంవత్సరం నుంచి ఉత్తమ దర్శకునికి అవార్డు ఇస్తున్నది. ఈనాడు కన్నడ భాషలో ఏడాదికి కనీసం మూడు నాలుగైనా గొప్ప చిత్రాలు వెలువడుతున్నాయంటే అందుకు పాత్రికేయుల దోహదం కూడా ఎంతో ఉన్నది.

తెలుగుదేశంలో అంతటి నిజాయితీ గల సంస్థ ఇంకో దశాబ్దానికైనా నెలకొంటుందా? తెలుగు ఫిలిం జర్నలిజంలోని కల్మషాన్ని ప్రక్షాళనం చేయడానికి అంధకారాన్ని చీల్చిచెండాడడానికి వెలిగించిన గోరంత దీపం ఈ 'సుచిత్ర'. సుచిత్రోదయానికే ఈ శీర్షిక అంకితం.

నండూరి పార్థసారథి
(1977 నవంబర్ లో ప్రచురితమయింది)

Previous Post Next Post