నోబెల్ బహుమతిని తిరస్కరించడం ద్వారా జాఁపాల్ సార్త్ర్ యూరోపియన్ మేధావి వర్గంలో సంచలనం రేకెత్తించినట్లుగానే, ఉస్తాద్ విలాయత్ ఖాన్ 1964లో సంగీత, నాటక అకాడమీ అవార్డును తిరస్కరించడం ద్వారా భారతీయ సంగీత రంగంలో తీవ్ర సంచలనం రేకెత్తించారు.

తిరస్కరించడానికి సార్త్ర్, విలాయత్ చెప్పిన కారణాలు కూడా ఒకటే. ఈ బహుమతులు నిష్పాక్షికంగా, కేవలం ప్రతిభను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నవి కావనీ, వాటి నిర్ణయంలో బోలెడంత రాజకీయం, గూడు పుఠాణీ జరుగుతున్నదనీ వారు భావించారు. అందుకు నిరసన వ్యక్తం చేయడానికి, ఆ విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావడానికి వారు ఆ బహుమతులను తిరస్కరించారు.

విలాయత్ ఖాన్ అకాడమీ అవార్డును తిరస్కరించడంతో దేశంలోని సంగీత విద్వాంసులు మాత్రమే కాక, మేధావి వర్గం వారందరూ ఒక్కసారి బుర్ర ఝాడించుకుని, లేచి కూర్చున్నారు. ఈ సంఘనటపై చాలాకాలం తర్జన భర్జనలు జరిగాయి. మన అకాడమీ లన్నీ-కళాకారులతో, సాహితీ పరులతో కాక అధికారులతో కిటకిట లాడిపోతున్నాయనీ, ప్రతిభావంతులైన కళాకారులు సైతం గుర్తింపు కోసం ప్రోత్సాహం కోసం ఆ అధికారులకు సలాము కొట్టవలసి వస్తున్నదనీ చాలా మంది జనాంతికంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాని, బహిరంగంగా విమర్శించే ధైర్యం వారికి లేకపోయింది. బహిరంగంగా విమర్శించే వారు కూడా తమకు బహుమతి యివ్వగానే కళ్ళకద్దుకుని తీసుకుని, విమర్శలు కట్టిపెట్టేస్తున్నారు. ప్రప్రథమంగా అకాడమీ అవార్డులను తిరస్కరించిన సాహసానికి ఒడిగట్టిన వాడు విలాయత్ ఖాన్. ఆయన తర్వాత ఇద్దరు ముగ్గురు కళాకారులు 'పద్మశ్రీ' అవార్డులను తిరస్కరించారు.

హిందూస్థానీ వాద్య సంగీతంలో ఈ శతాబ్దం మొత్తం మీద ఒక పది మంది మహా విద్వాంసులను లెక్కపెట్టాలంటే అందులో ఒక స్థానం తప్పకుండా విలాయత్ ఖాన్ కు లభిస్తుంది. అయినా అకాడమీ వారి కృపాదృష్టి ఆయన మీద పెందరాళే పడలేదు. ఆయన కంటే తక్కువ స్థాయివారికి కొందరికి అవార్డులు ఇచ్చిన తర్వాత ఇక ఆయనకు ఇవ్వకపోవడం ఆక్షేపణీయంగా ఉంటుందనే ఉద్దేశంతో మొక్కుబడి తీర్చుకునేందుకు ఇచ్చినట్లుగా ఇచ్చారు. 'నాకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినవారెవరు? వారు ఏ ప్రాతిపదికపై నిర్ణయం చేశారు? అని ఆయన ప్రశించారు. ఒక సెలెక్షన్ కమిటీ చేసిన నిర్ణయం ప్రకారం అవార్డు ఇస్తున్నట్లుగా అకాడమీవారు తెలియజేశారు.

ఆ సమాధానం ఆయనకు సంతృప్తి కలిగించలేదు. ఆ సెలెక్షన్ కమిటీలో అధికారులే తప్ప, సంగీత విద్వాంసులు లేరని ఆయనకు తెలుసు. ఫారిన్ డిగ్రీలు మాత్రమే యోగ్యతగా గలవారు, 'సంగీతంలో సరిగమలు తెలియని వారు ఇవ్వజూపే అవార్డు నాకు అక్కరలేదు' అని ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. తనకు ఆలస్యంగా అవార్డు ఇచ్చారన్న కోపంతో ఆయన ఆ పని చేయలేదు (అప్పటికి ఆయన వయసు 37 సంవత్సరాలు మాత్రమే). డెబ్భై, ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధతరం విద్వాంసులలో కొందరు అకాడమీ గుర్తింపు పొందకుండా మరణించిన విషయం ఆయనకి బాధ కలిగించింది.

అకాడమీ అవార్డును తిరస్కరించడం కంటే గొప్ప సాహన కృత్యం ఇంకొకటి ఆయన 1953 ప్రాంతాల్లోనే చేశారు. సంగీత కళాకారులకు అవకాశం, ప్రోత్సాహం ఇవ్వడంలో 'ఆకాశవాణి' అనుసరిస్తున్న విధానాలపట్ల నిరసనగా పండిత్ ఓంకార్ నాథ్ ఠాకూర్, కేసర్ బాయ్ వంటి పెద్దతరం విద్వాంసులతో కలిసి విలాయత్ ఖాన్ ఆకాశవాణిని బహిష్కరించారు. నిజానికి ఆకాశవాణి వల్ల ఆయనకు ఏమీ అన్యాయం జరగలేదు. ఆకాశవాణి ఆయనను ఎప్పుడూ వి.ఐ.పి. లాగానే గౌరవించింది. కాని, ఓంకార్ నాథ్ వంటి విద్వాంసులకు-వారి సంగీత జ్ఞానంలో వందో వంతుకూడా లేని 'ఆకాశవాణి' అధికారులు ఆడిషన్ పెట్టి, మార్కులు వేయడం, తమకు చిత్తం వచ్చినట్లుగా 'ఎ' క్లాస్ అనీ 'బి' క్లాస్ అనీ రాంకులు ఇవ్వడం ఆయనకు బాధకలిగించింది. 'జీహుజూర్ అంటూ సలాములు కొట్టే వారిని ప్రోత్సహించే అధికారుల ధోరణి పట్ల అసమ్మతి తెలియజేస్తూ ఓంకార్ నాథ్, విలాయత్ ప్రభృతులు 'ఆకాశవాణి'ని బహిష్కరించారు. అప్పటికి విలాయత్ కు 22 ఏళ్ళు. గొప్ప సితార్ విద్వాంసునిగా అప్పుడప్పుడే ఆయన పేరులోకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, లక్షలాది శ్రోతలకు సంగీతం వినిపించడానికి దేశంలో అందుబాటులో ఉన్న ఏకైక సాధనం 'ఆకాశవాణి'. దానితో పేచీ పెట్టుకోవడం, దానిని బహిష్కరించడం సామాన్య విషయం కాదు. అయినా ఆత్మగౌరవం గల కళాకారుల ప్రతినిధిగా ఆయన ఆ సాహసం చేశారు. అప్పటి నుంచి ఇంత వరకు ఆయన 'ఆకాశవాణి'లో అడుగు పెట్టలేదు. దేశంలో సామాన్య శ్రోతలకు రవిశంకర్, అలీఅక్బర్, బిస్మిల్లాఖాన్ ల పేర్లు తెలిసినంతగా విలాయత్ ఖాన్ పేరు తెలియకపోవడానికి ఇది ముఖ్య కారణం.

'పద్మభూషణ్' అవార్డు రవిశంకర్, అలీఅక్బర్ లకు ఐదారు సంతవ్సరాల క్రిందటే లభించినా, విలాయత్ కు ఇంత వరకు లభించకపోవడానికి కారణం తేలిగ్గా ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఆ అవార్డు ఇచ్చినా ఆయన తిరస్కరించడం తథ్యం.

విలాయత్ ఖాన్ కచేరీలు దక్షిణాదిని జరగడం అపురూపం. ఏడాదికో, రెండేండ్లకో ఒకసారి మద్రాసులో మాత్రం ఆయన కచేరీలు చేస్తూ ఉంటారు. ఇతర దక్షిణాది నగరాలలో ఆయన కచేరీలు జరగవు. దేశం మొత్తం మీద బహుశా అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకునే విద్వాంసుడు ఆయనే. అందుచేత ఆయనను పిలిపించే స్తోమతు చిన్న నగరాలలో చిన్న సంగీత సభలకు ఉండదు. ఇకపోతే ఆయన సంగీతం వినడానికి రికార్డులే శరణ్యం.

ఆయన రికార్డులు ఇంత వరకు 12 ఎల్.పి.లు, రెండు ఇ.పి.లు వచ్చాయి. వాటిలో రెండు రికార్డులు మాత్రం కొంచెం 'డల్'గా ఉన్నట్లు అనిపిస్తాయి. మిగిలినవన్నీ అద్భుతమైన రికార్డులు, ఆయన ప్రతిభ ఒక్కొక్క రికార్డులో ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతుంది, జీనియస్ ఆఫ్ విలాయత్ ఖాన్ (EALP 1266) రికార్డు, బిస్మిలా ఖాన్ తో కలిసి వాయించిన రికార్డు (ASD 2295), 'సుప్రీం జీనియస్ ఆఫ్ విలాయత్ ఖాన్ రికార్డు (EASD 1332), 'యమన్' రాగం వాయించిన రికార్డు (EASD 1350) హిందూస్థానీ సంగీత ప్రియులందరూ తప్పక కొనుక్కోవలసినవి. 'సుప్రీం జీనియస్ ఆఫ్ విలాయత్ ఖాన్ అనే శీర్షికతో వచ్చిన రికార్డులో ఆయన రెండు వైపులా దర్బారీ కానడ రాగాన్ని మహాద్భుతంగా, అద్వితీయంగా వాయించారు. ఒకవైపు ఆలాప్, జోడ్, ఝాలా, రెండోవైపు గత్ వాయించారు. (EASD 1350) రికార్డులో ఆయన రెండు వైపులా యమన్ రాగం వాయించారు. మొదటివైపు విలంబిత్ గత్, రెండో వైపు మధ్య లయగత్, ధ్రుత్ గత్ వాయించారు. విలంబిత్ గత్ ఖయాల్ పద్ధతిలో-రికార్డులలో ఇదివరకెవ్వరూ వాయించని విధంగా-వాయించారు. బిస్మిల్లాఖాన్ తో కలిసి వాయించిన రికార్డులో ఒకవైపు 'గుజరీతోడి' రాగం, రెండో వైపు 'చైతీ' ధున్, 'భైరవి' ఠుమ్రీ వాయించారు. 'జీనియస్ ఆఫ్ విలాయత్ ఖాన్' శీర్షికతో వచ్చిన రికార్డులో ఒకవైపు 'అహీర్ భైరవ్', రెండో వైపు 'ఖమాస్' ఠుమ్రీ వాయించారు. 'గురు' అనే ఇంగ్లీషు సినిమాకి ఆయన కూర్చిన సంగీతం ఒక ఎల్.పి. (EAHA 1006)గా వచ్చింది. ASD 2460 రికార్డులో 'రాగేశ్వరి', 'జయజయ వంతి' రాగాలు, ALP 1988 రికార్డులో 'సుహాసుగ్రాయ్', 'పీలూ' రాగాలు వాయించారు. ఇవన్నీ హిందూస్థానీ సంగీతపు లైబ్రరీలో అపురూపంగా భద్రపరచబడే గొప్ప రికార్డులు. ముందు తరాల కళాకారులకు ఉత్తేజపరచగల రికార్డులు.

నండూరి పార్థసారథి
(1974 సెప్టెంబర్ 13వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post