Title Picture

(5)

ఇక్కడ కలకత్తాలో కూడా సుబ్బణ్ణకు జీవితం సంతోషకరంగా లేదు. అసలు అతడిది సంతోషంగా ఉండే స్వభావం కాదు. మనుషులంతా మంచి వాళ్ళై ఉండాలనుకుంటాడు అతను. కాని అది అసాధ్యమైన విషయం. సుబ్బణ్ణలాంటి వాళ్ళకి సూర్యుడు ఉండాల్సినంత తేజోవంతంగా లేడనీ, గాలి ఉండాల్సినంత తేలికగా లేదనీ అనిపిస్తుంది. అన్నింటిలో ఏదో తక్కువతనం కనిపిస్తుంది. మైసూరులో మనుషులు మంచి వాళ్ళు కారని అసహ్యించుకుని అతడు కలకత్తా వచ్చాడు. తన ఇంట్లో వాళ్ళే కాదు - బైట వాళ్ళు కూడా మంచి వాళ్ళు కారని అక్కడి నుంచి వచ్చేశాడు. సంగీతంలో అతడి పాండిత్యం ఎక్కువవుతున్న కొద్దీ అతడి పట్ల ప్రత్యర్థుల అసూయ పెరుగుతూ వచ్చింది. వారి కారణంగానే అతడికి రాజా వారి ఎదుట గానం చేసే అవకాశం లభించకుండా పోయింది. ఆ సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతడికి కోపం, అసహ్యం తిరగబెడుతూ ఉంటాయి. కాని, ఇంత దూరం వచ్చినా ఇక్కడ కలకత్తాలోనూ అదే పరిస్థితి. అసూయ, అసహనం, అనాదరం ఇక్కడి మనుషుల్లోనూ ఉన్నాయి. ఆదర భావంతో ఆప్యాయంగా మాట్లాడే మనుషులు తాను పుట్టి పెరిగిన చోటనే లేకపోతే పరదేశంలో ఉంటారా? అయితే ఎలాగో త్వరగానే కొన్ని సంగీత పాఠాలు కుదుర్చుకోగలిగాడు. అతడిది దాక్షిణాత్య సంగీత పద్ధతి కావడం వల్ల కొందరు ప్రత్యేకాసక్తితో వచ్చి నేర్చుకోవడం మొదలుపెట్టారు. కొందరు చిన్న చిన్న కచేరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటి వల్ల సంపాదనకు లోటులేకుండా పోయింది. సంసార పోషణకు సంబంధించిన ఆందోళన తీరిపోయింది. భార్యకు మంచి చీరలు కొనేవాడు. కొడుక్కి మంచి బట్టలు కుట్టించేవాడు. బైట వాళ్ళతో పరిచయాలు తక్కువ కనుక సాధారణంగా రోజంతా ఇంట్లోనే ఉండేవాడు. భార్య ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఎంత సేపైనా అలా చూస్తూ గడిపేవాడు. క్రమంగా భార్యపట్ల అతడికి ప్రేమానురాగాలతో పాటు పూజ్యభావం పెరుగుతూ వచ్చింది. కొడుకంటే అతడికి పంచ ప్రాణాలు. భార్యాపుత్రులపైగల ప్రేమ అతడి సంగీతంలో మిళితమైనదా అన్నట్లు అతని వైలిన్ వాదనం ఒక కొత్త అందాన్ని, ఆకర్షణను సంతరించుకున్నది. సామాన్యంగా సంసారులందరికీ జీవితంలో సగం సుఖం, సగం చింత కలిపి ఉంటాయి. సుబ్బణ్ణ కూడా అటువంటి స్థితిలో రోజులు, వారాలు, సంవత్సరాలు గడిపాడు.

లలితమ్మకు మాత్రం జీవితం సుఖంగా, తృప్తిగా సాగిపోతోంది. ఆమెకు భర్తే దైవం. భర్తే ఆమె ప్రపంచం. అతను ఎదురుగా ఉంటే చాలు. ఆమెకు ఇంకేమీ అక్కర్లేదు. అతడు సంతోషంగా ఉండాలన్నదే ఆమె కోరిక. తన కోసం ఎప్పుడైనా ఏదైనా అడిగినా ఆ వస్తువుపై ఆమెకు ప్రబలమైన కోరిక ఉండేదికాదు. భర్త పట్ల అటువంటి ఏకాగ్రభక్తి చాలా మంది స్త్రీలకు ఉంటుంది. సీత, సావిత్రి అటువంటి స్త్రీలే. వారి పతిభక్తి ఋషుల తపస్సు కంటే తక్కువది కాదు. జీవితంలోని అన్ని సంస్కారాలను వారు ఆ ఏకాగ్రతతోనే సాధిస్తారు. లలితమ్మ సచ్ఛీలంలో ఇదివరకే ఒక ఉన్నతస్థితిని చేరుకున్నది. ప్రతి సందర్భంలోనూ తన సుఖాన్ని, తన కోరికలను మరిచిపోయి ఇతరుల సంగతి చూడడం మైసూరులో ఉండగానే ఆమెకు అలవాటయింది. ఇప్పుడు కలకత్తాలో ఆమెకు భర్త, కొడుకు తప్ప వేరే ప్రపంచంలేదు. అనంతమైన తన ప్రేమని ఆమె వారిద్దరిపై కురిపించింది. వారి సంరక్షణ కోసమే భువిపై వెలసిన దేవి అవతారమా అన్నట్లు ఆమె వారికి రక్షకురాలయింది.

సుబ్బణ్ణ ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నందు వల్ల భార్యకు సంగీతం నేర్పే అవకాశం ఏర్పడింది. లలితమ్మతాను భర్త నుంచి నేర్చుకున్న సంగీతాన్ని ఇరుగుపొరుగు పిల్లలకు నేర్పేది. ఇంటి పనులు చేసుకోవడం, గౌరీపూజ చేసుకోవడం, భర్తకు, కుమారునికి కావలసినవి సమకూర్చడం, ఇరుగుపొరుగు వారి కష్టసుఖాలు విచారిస్తూ వారికి తన శక్తిమేరకు సహాయపడడం-ఇదీ ఆమె దైనిక జీవితం.

ఎక్కడున్నా మనిషికి ఎలాగో ఒక లాగు రోజులు గడిచిపోతాయి. దానికేమీ శ్రమ పడనవసరం లేదు. శ్రమ పడవలసినదల్లా జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోవడానికే. సుబ్బణ్ణ, లలితమ్మ కలకత్తాలో పన్నెండేళ్ళు అలా ప్రశాంతంగా జీవించారు. ఆ కాలంలో లలితమ్మకు ఒక ఆడపిల్ల పుట్టిపోయింది. తరువాత మూడేళ్ళకు మరొక ఆడపిల్ల పుట్టింది. భార్యా భర్తలిద్దరూ ఆ పిల్లను ఎంతో గారాబంగా పెంచారు. పిల్లకు నాలుగేళ్ళు వచ్చేసరికి శేషుకు తీవ్రమైన శీతజ్వరం వచ్చి ఎంతవైద్యం చేయించినా ఫలితం లేక చనిపోయాడు.

లలితమ్మ దుఃఖానికి అంతులేదు. శేషుమరణం సుబ్బణ్ణకు అశనిపాతం అయింది. దిక్కుతోచని లలితమ్మ ఇది వరకటికంటే ఎక్కువగా గౌరీపూజపై మనస్సు లగ్నం చేసింది. “తల్లీ... పోయిన వాళ్ళ కోసం ఏడవను. ఉన్నవాళ్ళని కాపాడు” అని దేవిని వేడుకొనేది. ఆ రోజుల్లో ఆమెకు అత్తమామలు చనిపోయినట్లు కలలు వచ్చేవి. అయితే ఆ విషయం భర్తకు చెప్పలేదు. తన భయాలను, కోరికలను తానే అదుపులో పెట్టుకొనేది. ఆమెకు దైవభక్తి, పతిభక్తి మాత్రమే నిజం. అవి తప్ప ఇంకేవీ అక్కర్లేదు. సుబ్బన్న ప్రకృతి భిన్నమైనది. అతడికి కుమారుని మరణం దుస్సహవేదన కలిగించింది. లలితమ్మలాగా సుబ్బణ్ణ దైవభక్తి అలవరచు కోలేదు. దేవుడి విషయం మనస్సులోకి రాగానే అతడు “ఏం దేవుడు? రత్నం లాంటి కొడుకును తీసుకుపోయాడు. ఇంతకంటే ఘోరమైన కష్టం, నష్టం ఏమి జరుగుతాయి నాకు?” అనుకునే వాడు. కొంతకాలానికి నెమ్మదిగా ఆ బాధను మరచిపోగలిగాడు. “జరిగిన దాన్ని గురించి చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి?” అనుకుని మళ్ళీ ఇదివరకటి లాగా సంగీత పాఠాల మీద, భార్యమీద, మిగిలిన ఒక్క బిడ్డ మీద శ్రద్ధవహించడం మొదలు పెట్టాడు. వయస్సు వల్ల, సంతాన వియోగబాధ వల్ల అతడికి తెలియకుండానే అతడి హృదయం కొద్దిగా మృదువయింది.

కూతురికి తొమ్మిదేళ్ళు వచ్చేసరికి లలితమ్మ మళ్ళీ మైసూరు ప్రస్తావన తీసుకువచ్చింది. పిల్ల పెద్దదవుతుంది. పెళ్ళి చేయాలి. మైసూరుకు పోయి తగిన వరుని కోసం అన్వేషించాలి. తన జన్మస్థలానికి తిరిగివెళ్ళడం సుబ్బణ్ణకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మైసూరుకు పోతే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాలి. వాళ్ళు ఇంకా బతికున్నారో లేదో తెలియదు. మైసూరు నుంచి వచ్చేసినప్పుడు శేషు ఉన్నాడు. ఇప్పుడు శేషు లేకుండా వెళ్ళడానికి మనస్కరించడం లేదు. కాని ఏం చేయాలి? కూతురికి పెళ్ళి చేయాలంటే అక్కడికి వెళ్ళవలసిందే. వెంటనే బయలుదేరి వెళ్ళడమా, లేక ముందుగా అక్కడి బంధువులకు జాబు రాసి తరువాత వెళ్ళడమా అని ఆలోచనలో పడ్డాడు. అంతలో ఒకరోజు గంగా స్నానానికి వెళ్ళిన కూతురు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. సుబ్బణ్ణకు, లలితమ్మకు జీవితం అంధకార బంధురమైపోయింది. “పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేశానో ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఈ జన్మలో మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు దూరం చేశాను. ఈ పాపానికి వచ్చే జన్మలో ఇంకెంత శిక్ష అనుభవించాలో” అని ఏడుస్తూ లలితమ్మ నది ఒడ్డున కూలబడిపోయింది. సుబ్బణ్ణకు ఆలోచించే శక్తి కూడా లేకుండాపోయింది. కుమార్తెకు ఉత్తర క్రియలు జరిపి, భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.

ఈ శోక పరంపరను వర్ణించడం నాకూ బాధగానే ఉంది. కాని జరిగిన సంఘటనలను నేను మార్చలేను. జరిగిన దాన్ని రాయక తప్పదు. మూడవ బిడ్డ కూడా పోయిన తరువాత లలితమ్మ జబ్బు మనిషైపోయింది. “ఇంక ఇక్కడ ఉండలేను. మన ఊరికి పోదాం” అనేది ఆమె. “అక్కణ్ణించి వచ్చేటప్పుడు ఇక్కడ బాగా బతకగలమనే గర్వంతో వచ్చాం. ఇప్పుడు ఓడిపోయామని ఒప్పుకొని వెనక్కి తిరిగి పోవాలా? అక్కడ ఏముందని వెడతాం? అక్కడున్నదేదో ఇక్కడా ఉంది. వానలో తడిసిన కాకుల్లాగా ఇద్దరం కన్నీళ్ళలో తడిసి ముద్దయ్యాము. ఈ జీవిత శేషం ఎక్కడో అక్కడ ఎలాగో గడిపేసి కన్నుమూద్దాం” అనేవాడు సుబ్బణ్ణ. లలితమ్మ ఇంక వాదించకుండా మెదలకుండా ఊరుకుంది. “భర్తే దైవం అనుకున్న దాన్ని మళ్ళీ నాకొక ఇష్టం అయిష్టం అంటూ అజ్ఞానంలో పడుతున్నానేమిటి?” అనుకుని ఆమె మళ్ళీ గౌరీపూజపై మనస్సులగ్నం చేసింది. “తల్లీ... ఎక్కడెక్కడి దుఃఖ మంతా అనుభవించడం అయింది. ఆయన్ని ఒక్కణ్ణీ కాపాడు. సుమంగళిగా నన్ను నీ పాదాల వద్దకు చేర్చుకో. ఇంకా నీకు అనుగ్రహం ఉంటే ఒక్కసారి మా అమ్మను కళ్ళారా చూసే భాగ్యం కలిగించు” అని ఆమె ప్రార్థించింది.

ఈ ఒక్క చివరి కోరిక తీరలేదు. మిగిలినది ఆమె అనుకున్నట్లే జరిగింది. సంతాన వియోగం వల్ల కలిగిన శోకంతో రోజురోజుకూ క్రుంగికృశించి ఆరేడు సంవత్సరాలకు ఆమె సుమంగళిగానే గౌరీదేవి పాదాల సన్నిధి చేరింది. ఆమె చివరి రోజులలో సుబ్బణ్ణ ఆమెను ఒక బిడ్డలాగా సాకాడు. వారు ఒకరినొకరు భార్యాభర్తలుగా సంభావించుకోవడం మానివేశారు. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే ఒక విచిత్రస్నేహసంబంధం ఇద్దరి మధ్య నెలకొన్నది. ఇద్దరి మనస్సులూ ఒక్కటిగా అయిపోయాయి. లలితమ్మ తన భర్తను దైవంలా సంబోధిస్తూ 'దేవుని ఇచ్ఛ', 'దేవుని సేవ', 'దేవుని అనుగ్రహం' అంటూ ఉండేది. సుబ్బన్న ఆమె పక్కన కూర్చుని తనలో తను అనుకునేవాడు “ఎంత గొప్పసంస్కారం ఈమెది. నేను మొండి మనిషిని. నా కోసం తన ఇష్టాయిష్టాలన్నింటినీ పూర్తిగా మరచిపోయి నేను చెప్పినదల్లా చేసింది. దైవం పట్ల ఎంత విశ్వాసం ఈమెకి!”

ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నిజంగా ఆమె జగన్మాత అవతారమేనని సుబ్బన్నకు అనిపించింది. తనపై అనుగ్రహంతో తనను ఉద్ధరించడానికి జగన్మాత లలితగా అవతరించిందని అనుకున్నాడు. లలితమ్మ మరణించినప్పుడు సుబ్బన్న ఏడవలేదు. ఏడవడం సరికాదనుకున్నాడు. భార్యకు ఉత్తర క్రియలు జరిపించి, ఇకపై తన జీవితయాత్ర ఎలా సాగించాలా అని యోచించాడు. తన భార్య నమ్మిన దైవంలో తానూ విశ్వాసం కుదుర్చు కోవాలనుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు.

(6)

ఎందుకు పుడుతున్నాం? ఎలా బతుకుతున్నాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి పోతున్నాం? సంసార సాగరంలో పయనిస్తూ, ఉవ్వెత్తున లేచే కెరటాలను చూసి అవేవో హిమాలయ పర్వతాలని భ్రమించి ఎందుకు భయపడుతున్నాం? కష్టమనేది కేవలం భ్రమ వల్ల జనించే భయమే అయితే భ్రమ కాని నిజం ఏది? సుఖం నిజమా? సంతోషం నిజమా?... అప్పటికి సుబ్బణ్ణ గారికి దాదాపు అరవయ్యేళ్ళున్నాయి. ఒంటరిగా ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించి దేవుని సేవించాడు ఆయన. జీవన తత్త్వాన్ని గురించి రాత్రింబవళ్ళు ఆలోచించాడు. అయినా ఆయన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. జీవితం అనేది ఒక బయలు నాటకమనీ, అందులో ప్రేక్షకులే వేషాలు వేసుకొని నటిస్తారనీ ఆయనకి అనిపించింది. మైసూరులో జనాన్ని అసహ్యించుకొని, అక్కడి నుంచి కలకత్తా వచ్చి కాపరం పెట్టడం పిల్లలు వీధిలో ఆడుకునే ఆటగా అనిపించింది. కనీసం తన ఒక్కడి విషయంలో అది నిజం అనుకున్నాడు. లలితమ్మ తన జీవిత భాగస్వామిని కావడం మాత్రం తాను చేసుకున్న గొప్ప పుణ్యఫలితం అని అనుకున్నాడు. ఇతరుల పట్ల ఎంత సహనంతో ప్రవర్తించేది ఆమె! తానెప్పుడూ అటువంటి సహనాన్ని అలవరచుకోలేకపోయాడు. తల్లిదండ్రులను వదిలి రావడం తప్పని ఇప్పుడు అనిపిస్తోంది ఆయనకి. తన కొడుకు, కూతురు, మరణించినప్పుడు తను ఎంత బాధపడ్డాడు? తను వచ్చేసినప్పుడు తన తల్లిదండ్రులూ అంత బాధపడి ఉంటారు కదా! ముక్కుకు సూటిగా పోవడమే తన పద్ధతి. తనకు ఎంత తోస్తే అంతేగాని ఇతరులు చెప్పేది వినే అలవాటు తనకు లేదు. ఇతరుల కష్టాన్ని, సుఖాన్ని తానెప్పుడూ పట్టించుకోలేదు. సుబ్బణ్ణగారు తన స్వభావం గురించి ఇలా రోజులు తరబడి ఆలోచించాడు. తీర్థయాత్ర పూర్తి చేసుకొని కలకత్తా తిరిగి వచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టగానే మళ్ళీ భార్యాబిడ్డల స్మృతులు ముసురుకున్నాయి. తన కొడుకు అంత చిన్న వయస్సులో పోయాడు. ఆ పిల్లవాడి కాస్త జీవితాన్ని తలుచుకున్నప్పుడు తాను చేసింది తప్పు కాదని ఆయనకి అనిపించింది. మైసూరులోనే ఉండిపోతే పిల్లవాడు కడుపునిండా పెరుగన్నమైనా తినలేకపోయేవాడు. తన భార్య మాత్రం? అత్తగారి చేత తిట్లుతింటూ ఉండేది. అక్కడి నుంచి రావడమే మంచిదయింది. స్వస్థలం వదిలిపెట్టాడు తను. అయితే మాత్రం ఏం పోయింది? తన భార్యాబిడ్డలు కలకత్తాలో ఉన్నంతకాలం సుఖంగానే ఉన్నారు. ఇతరులు తనను చెడ్డవాడనుకున్నారు. అనుకోనీ... ఎవరేమనుకుంటే తనకేం? మంచివాడని నలుగురిచేత అనిపించుకోలేకపోయానన్న చింత తనకేమీ లేదు. కనీసం కలకత్తాలోనైనా భార్యబిడ్డలను సుఖపెట్టగలిగాడు. “ఇంక మిగిలిన జీవితం ఎక్కడో అక్కడ ఎలాగో గడిపేస్తాను” అనుకున్నాడు.

ఇంట్లో తిరుగుతుంటే పాత జ్ఞాపకాలు గుండెని తొలిచేశాయి. కొడుకును సుఖపెట్టాలనుకుని మైసూరు నుంచి వచ్చేశాడు తను. ఆ కొడుకు పోయాడు. ఏ పోరూ పొక్కూలేకుండా, తిండికీ బట్టకీ లోటులేకుండా తన భార్య ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు. అందుకోసం దేశం కాని దేశంలో తను చేయగలిగినదంతా చేశాడు. ఇప్పుడు ఆమె కూడా లేదు. పిల్లలు ఇసుకతో కట్టుకున్న పిచ్చిక గూళ్ళు వర్షానికి కొట్టుకుపోయినట్లు తన ఆశలన్నీ భార్యా బిడ్డలతో పాటే కొట్టుకుపోయాయి. ఏదైనా ఆలయానికి వెళ్ళి దైవసన్నిధిలో నిలబడినప్పుడు కలిగేశాంతి ఇంటికి రాగానే మాయమైపోతుంది. కలకత్తాలో బాగా బతికిన రోజుల్లో సుబ్బణ్ణగారు మొదటతాను అద్దెకు తీసుకున్న ఇంటినే కొనుక్కున్నాడు. ఇంటికి అప్పుడప్పుడు బోలెడు సామానుకొన్నాడు. కొడుకు కోసం బట్టలు, పుస్తకాలు, ఇంకా అనేక వస్తువులు కొన్నాడు. కొడుకు పోయిన తరువాత లలితమ్మ ఆ వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టింది. ఆ పెట్టెను తన దగ్గర పెట్టుకునేది. కూతురుకోసం కొన్న బట్టలని, ఆభరణాలని వేరేపెట్టెలో పెట్టింది. తన బట్టలన్నీ ఇంకో పెట్టెలో పెట్టుకున్నది. ఆ మూడు పెట్టెలనీ తెరిచి చూసి సుబ్బణ్ణగారు తను భార్యాబిడ్డలతో సుఖంగా గడపిన రోజులన్నీ నెమరువేసుకున్నాడు. ఇప్పుడు తన జీవితం శూన్యమైపోయింది. ఇంక తను ఆ ఇంట్లో ఉండలేనని నిర్ణయించుకున్నాడు. తను సంగీత పాఠాలు చెప్పిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, తను వెళ్ళిపోతున్నాననీ, తన ఇంట్లో సామానులు ఎవరికి కావాలసినవి వారు తీసుకోవచ్చుననీ చెప్పాడు. వారు తీసుకోగా మిగిలిన వస్తువులని పేదలకు పంచిపెట్టాడు. ఇంటిని ఒక భక్తసమాజానికి దానం చేశాడు. చిన్నతనం నుంచి తను వాయిస్తున్న వైలిన్ తీసుకుని, కొద్దిపాటి డబ్బుతో కలకత్తా నుంచి బయలుదేరాడు.

అప్పటివరకు తను ఎక్కడికి వెళ్ళాలన్న విషయం ఆలోచించలేదు. రైలుస్టేషన్ కి వచ్చాక ఆయన తన దగ్గరున్న డబ్బంతా బుకింగ్ క్లర్క్ చేతుల్లో పెట్టి టికెట్ అడిగాడు.

“ఎక్కడికి?” అని అడిగాడు బుకింగ్ క్లర్క్.

“ఎక్కడికైనా సరే” అని జవాబిచ్చాడు సుబ్బణ్ణ గారు.

“ఎక్కడికైనా అంటే ఎలా టికెట్టివ్వగలను?” అన్నాడు క్లర్క్. తన అవస్థ తలుచుకుంటే సుబ్బణ్ణగారికి విచారం కలిగింది. కొంచెం నవ్వూ వచ్చింది.

“నేను ఫలానా చోటికి అని చెబితే అక్కడికి టికెట్ ఇవ్వడం మీకు సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. అలా కాక ఎక్కడికైనా సరే ఇవ్వమంటుంటే మీ ఇష్టం వచ్చిన చోటికి టికెట్ ఇవ్వడానికి మీకు ఏమిటి కష్టం? మీకు నేనిచ్చిన డబ్బుతో ఎంత దూరం ప్రయాణం చేయడానికి వీలవుతుందో అంత దూరానికి టికెటివ్వండి” అని అడిగాడు సుబ్బణ్ణగారు.

బుకింగ్ క్లర్క్ ఈ ముసలాయనకి మతిస్థిమితం ఉందా లేదా అన్నట్లు సుబ్బణ్ణగారిని ఎగాదిగా చూశాడు. ఆయన వాలకాన్ని బట్టి దక్షిణాది వాడని గుర్తించి బొంబాయికి టికెటిచ్చాడు. మూడు రూపాయలపై చిల్లర తిరిగి ఇచ్చాడు కూడా. సుబ్బన్నగారు ఆ టికెట్ ఏ ఊరికి ఇచ్చారో కూడా చూసుకోకుండా, అన్నిటి కంటే ముందుగా బయలుదేరే రైలు ఎక్కి కూర్చున్నాడు.

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Previous Post Next Post